అరుణాచల క్షేత్రం

భక్తిని, ముక్తిని ప్రసాదించే అరుణాచల క్షేత్రం

సృష్టి అంతయూ పంచభూతములచే జనించి, అంతిమంగా వాటిలోనే లీనమువుతుంది. అందుకే పంచభూతాలైన పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశమనే ఈ ఐదింటికీ సనాతన ధర్మంలో పెద్ద పీటవేసారు.  అంతేకాక పంచభూతాలకి అధిపతి అయిన పరమేశ్వరుని భక్తితో ఆరాధిస్తారు. నిరాకారుడైన ఆ ఈశ్వరుడు కూడా. పంచభూత లింగాలుగా అవతరించి భక్తులచే పూజలందుకుంటున్నాడు.  కోరిన కోరికలను అనుగ్రహిస్తూ మోక్షమార్గం వైపు నడిపిస్తున్నాడు.

అరుణాచలం ప్రశస్తి :

పంచభూత లింగాల క్షేత్రాలలో అరుణాచలం ఒకటి.  ఈశ్వరానుగ్రహం ఉంటేకానీ ప్రవేశం పొందలేని ప్రదేశం అరుణాచలం. "అరుణ" అంటే "ఎర్రని", "అచలం" అంటే "కొండ"... "అరుణాచలం అంటే ఎర్రనికొండ" అని అర్థం.   తిరువణ్ణామలైగా పిలువబడే ఈ శైవక్షేత్రం పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఉంది.  ఇక్కడ పరమశివుడు పంచభూత లింగాలలో ఒకటైన "అగ్ని లింగంగా దర్శనమిస్తాడు. మిగిలినవి కంచిలో పృథ్వీలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, జంబుకేశ్వరంలో జలలింగం, చిదంబరంలో ఆకాశలింగంగా పరమేశ్వరుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు".   పురాణాలలో కొనియాడబడిన అరుణాచలం క్షేత్రంలోని దేవాలయం శివాజ్ఞచే విశ్వకర్మచే నిర్మించబడినది పురాణాలు తెలుపుతున్నాయి.  ఇక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షిచే నిర్ణయించబడినదని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహాత్యం తెలుపుతున్నది.

అరుణాచల క్షేత్రంలో కొలువై ఉన్న పరమశివుని అరుణాచలేశ్వరునిగా, అన్నామలైర్గా భక్తులు కొలుస్తారు.  పార్వతీదేవివి ఉన్నామలై అమ్మన్ గా, అపితకుచాంబ అమ్మవారిగా ఆరాధిస్తారు.

రమణ మహర్షి :

ఆరుణాచలం ఋషులకు, యోగులకు సిద్ధులకు విలయం. ఎందరో సిద్ధపురుషులు తమ తపోదీక్షతో, యోగశక్తితో పరమేశ్వరుని అనుగ్రహమునకు పాత్రులైనారు. అట్టివారిలో రమణమహర్షి ఒకరు. పూర్వాశ్రమంలో వీరిపేరు వెంకటరామన్ అయ్యర్, తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చుళిలో 1879 డిసెంబరు 30వ తేదీన జన్మించారు. ప్రముఖ వీరశైవకవి చామరస రచించిన ప్రభులింగలె అన్న కన్నడ పద్య కావ్యానికి తమిళరూపం చదవటం ద్వారా అరుణాచలం అనే పవిత్ర ప్రదేశం ఒకటి ఉన్నదని వెంకటరామన్ తెలుసుకున్నారు. సెక్కిళర్ వ్రాసిన పరియపురాణంలోని 63 మంది నాయనార్ల జీవితచరిత్రలు చదవటం వలన వెంకటరామన్ ఎంతగానో ప్రభావితులైనారు. 16 సం.ల వయస్సులో మోక్షజ్ఞానం పొంది వెంకటరామన్ తిరువణ్ణామలై చేరుకున్నారు.

తిరువణ్ణామలై చేరుకున్న వెంకటరామన్ మొదటగా అరుణాచలేశ్వరుని సందర్శించారు. గుండు చేయించుకుని, కౌపీనం ధరించి దేహభ్రాంతిని వీడి వెంకటరామన్ పాతాళలింగం దగ్గర సమాధిస్థితిలో మునిగిపోయారు. ఎంతటి గాఢమైన స్థితి అంటే క్రిమికీటకాలు శరీరాన్ని గాయం చేస్తున్నా.... తెలియని పరిస్థితి. ఆ స్థితిలో ఉన్న వెంకటరామను శేషాద్రి స్వామి బయటకు తీసుకువచ్చి, శరీరాన్ని శుభ్రం చేశారు.  వెంకటరామన్కి ఆకలిదప్పులు తెలిసేవి కాదు. పరిసరాలపై స్పృహ ఉండేది కాదు.  నెమ్మదిగా ఆయన నివాసం అరుణాచలం కొండపైకి మారింది.  అక్కడ ఉన్న సద్గురు గుహలో, నమశ్శివాయ గుహలో, విరూపాక్ష గుహలో ఆయన ఆధ్యాత్మిక సాధన సాగింది.  ఆయన యొక్క సాధన, మౌనం సందర్శకులను విశేషంగా ఆకర్షించింది.  అత్యుత్తమ జ్ఞానిగా గుర్తించసాగారు.  ఒక పర్యాయంవేదపండితులు, పలు శాస్త్రాలలో విశేషమైన జ్ఞానము సముపార్జించిన కావ్యగణపతి వెంకటరామన్ను సందర్శించారు. ఆత్మ విచారణలో ఉపదేశం వెంకటరామన్ మంచి పొందిన కావ్యకంఠ గణపతి వెంకటరామన్ను "భగవాన్ రమణమహర్షి" అని సంబోధించటం జరిగింది.  అప్పటినుంచి వెంకటరామన్ రమణమహర్షిగా ఖ్యాతి గడించారు."

భగవాన్ రమణులు సాధారణ సన్యాసి జీవితాన్ని గడిపేవారు. క్రమంగా సందర్శకుల సంఖ్య పెరిగింది. తనను చూడటానికి వచ్చినవారికి, దర్శనమిచ్చి వారితో మౌనంగా కూర్చునేవారు. అప్పుడప్పుడు ఒకటి, రెండు మాటలు మాట్లాడేవారు. భగవంతుని నిజమైన పాదాలు, భక్తుని హృదయంలో ఉంటాయని నిరంతరం ఈ పాదాలను పట్టుకోవడమే నిజమైన ఆనందమని ప్రతి ఒక్కరూ అందుకోసం ప్రయత్నించాలని చెప్పేవారు.  నిత్యం స్వయంగా పరమేశ్వరుని ఆరాధిస్తూ అరుణాచలం గిరిచుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉండేవారు.  భక్తులు ఆయన్ని అనుసరించేవారు. అదే గిరిప్రదక్షిణం ఈనాటికీ కొనసాగుతున్నది.

గిరిప్రదక్షిణ :

అరుణగిరి పడుకొని ఉన్న పరమశివుని స్వరూపం. అరుణాచలంలోని పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపం.  అరుణగిరి ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేయటం. అందుకే గిరిప్రదక్షిణ ప్రాముఖ్యాన్ని పదే పదే భక్తులకు చెప్పినది రమణమహర్షి జీవితకాలంలో కనీసం ఒక పర్యాయం అరుణాచల గిరిప్రదక్షిణ చేసిన... సాక్షాత్తు పరమేశ్వరుని ప్రదక్షిణం చేసిన పుణ్యం వస్తుందని మహాత్ములు కూడా సెలవిచ్చారు.

గిరిప్రదక్షిణ నియమాలు:

గిరిప్రదక్షిణం రమణాశ్రమం నుంచి కానీ, రాజగోపురం వద్దనుంచి కానీ ప్రారంభించవచ్చు. కానీ "ఎక్కడ ప్రారంభించారో... అక్కడనే గిరిప్రదక్షిణ ముగించాలి". గిరిప్రదక్షిణకు ఉపకమించేవారు... తలస్నానం చేసి.. విభూతి ధారణ చెయ్యాలి. చెప్పులు ధరించకూడదు. ముందుగా క్షేత్రపాలకునికి మన సంకల్పం చెప్పి అనుమతి తీసుకోవాలి. రాజగోపురం దగ్గర ఉన్న శక్తి గణపతిని దర్శించి ఆశ్వీర్వాదం తీసుకొని అన్నామలై, ఉన్నామలై అమ్మవారికి నమస్కరించాలి. అనంతరం రాజగోపురం దగ్గరవద్దకు వచ్చి, మనస్సులో వినాయకుని తలచుకొని ప్రదక్షిణం పూర్తిచేసే శక్తిని ప్రసాదించమని కర్పూరం వెలిగించి, కొబ్బరికాయ కొట్టి గిరిప్రదక్షిణకు ఉపక్రమించాలి. కొందరు రమణాశ్రమం నుంచి ప్రదక్షిణ ప్రారంభిస్తారు.  ఆ విధంగా కూడా చేయవచ్చు.  అరుణగిరి ప్రదక్షిణ కోసం మనం వేసే తొలి అడుగు మానసిక ప్రాపములను, రెండో అడుగు వాచక పాపములను, మూడో అడుగు శారీరక పాపములను నశింప చేస్తుందని పెద్దలు చెపుతారు. అందుకే ఎందరో భక్తులు నిత్యం గిరి ప్రదీక్షణం చేస్తూ ఉంటారు.  రాత్రి సమయంలో కూడా. పౌర్ణమిరోజు వీరి సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది "అరుణాచల గిరిప్రదిక్షణ ఎప్పుడూ మనకు ఎడమవైపు నుంచి మాత్రమే చెయ్యాలి". కుడివైపున దేవతలు, సిద్ధులు అదృశ్యరూపంలో గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం వారికి ఎదురు వెళ్ళకూడదు.

గిరిప్రదక్షిణ క్రమం :

గిరిప్రదక్షిణ దూరం 14 కి.మీ. ఈ ప్రదక్షిణ క్రమంలో భక్తులు శివనామస్మరణ చేస్తూ నెమ్మదిగా ముందుకు సాగాలి. ఈ క్రమంలో "తూర్పున ఉన్న ఇంద్రలింగం, ఆగ్నేయాన ఉన్న అగ్నిలింగం, దక్షిణాన ఉన్న యమలింగం, నైఋతిన ఉన్న నైరుతిలింగం, పడమర వరుణలింగం, వాయువ్యమున వాయులింగం, ఉత్తరాన కుబేరలింగం, ఈశాన్యాన ఉన్న ఈశాన్యలింగమును భక్తులు ఈ అష్టలింగాలను సందర్శిస్తారు." అంతేకాక సూర్యలింగం, చంద్రలింగం కూడా దర్శించే అవకాశం వస్తుంది. ఇవికాక మార్గమధ్యంలో అష్టనందులు ఇతర దేవాలయాలను దర్శించవచ్చు. నైఋతిలింగం తరువాత ఉన్న నేరు అన్నామలై దేవాలయం అనగా అరుణాచలేశ్వరుని ఆలయం వెనుకన ఉన్న శిఖరానికి ఎదురుగా ఉన్న ఆలయమును, వరుణలింగం తరువాత కుడివైపు కిలోమీటరు దూరంలో ఉన్న ఆది అన్నామలై ఆలయమును సందర్శించవచ్చు. అంతేకాక కుబేరలింగం తరువాత వచ్చే ఇరుక్కుపిల్లయార్ మోక్షమార్గం కూడా భక్తులను భక్తిభావంతో అలరిస్తుంది. ఈ మార్గంద్వారా వేళ్తే జన్మ రాహిత్యం పొందుతామని భక్తుల విశ్వాసం. ఈ ఆలయములే కాక అగ్నిలింగం తరువాత రమణాశ్రమం, శ్రీ శేషాది స్వామివారి ఆశ్రమం సందర్శించే అవకాశం కలుగుతుంది. ఇవన్నీ భక్తులలోని భక్తి భావనను రెట్టింపు. చేస్తాయి. ఆత్మతృప్తిని, నూతన అనుభూతులను పంచిపెడతాయి.

రమణాశ్రమం :

గిరిప్రదక్షిణలో భాగంగా భక్తులు తప్పనిసరిగా రమణాశ్రమమును సందర్శిస్తారు. ప్రశాంత వాతావరణమునకు ప్రతిరూపంగా చక్కటి వాతావరణంలో ఆధ్యాత్మిక భావనలు వెదజల్లుతూ మనస్సుకు ఎంతో స్వస్థత చేకూరుస్తుంది.

రమణమహర్షి తల్లి అళగమ్మార్ సమాధి. అక్కడ రెండు శ్రీ చక్రాలు, రాతిబల్లపై కూర్చున్న రమణమహర్షి రాతి విగ్రహం, రమణమహర్షి సమాధి, రమణులు వాడిన వస్తువులు భద్రపరచిన మహానిర్వాణ రూమ్, ధ్యానమందిరం ఇలా... ఎన్నో సందర్శకుల మనస్సును దోచుకుంటాయి. రమణమహర్షి బోధనలలో ప్రధానమైనది మౌనం. రమణాశ్రమంలోకి అడుగిడగానే మనస్సు ప్రశాంతతను కోరుకుంటుంది. కొద్ది క్షణాలైన ధ్యానముద్రతో కూర్చుంటే స్వస్థత చేకూరుతుంది.

ఆది అన్నామలై ఆలయం :

రాజగోపుర నుంచి గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటే ఏడు | కి.మీ. తరువాత అనగా వరుణ లింగం తరువాత ఆది అన్నామలై ఆలయం వస్తుంది. ప్రధాన మార్గం నుంచి 300 మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. 2000 సం॥ల చరిత్ర కలిగిన ఆలయం ఇది. మొదట చెక్కతో తరువాత రాతితో ఈ ఆలయం నిర్మాణం సాగించారు. రాత్రి సమయంలో ఈ ఆలయంలో దేవతాశక్తులు సంచరిస్తాయని పేరు, ఆలయ ప్రవేశమునకు ముందు కులమని పిళ్ళయ్యారు అను గణపతి దేవాలయం కలదు. ఈ గణపతిని ఆరోగ్యం కొరకు ప్రార్థించాలి. ఈ ఆలయం నిర్మాణం వెనుక ఓ కథ ఉంది. పూర్వం బ్రహ్మదేవుడు త్రిలోత్తమను సృష్టించిన తరువాత ఆమె అందం చూసి మోహితుడై పావురం రూపంలో వెంటపడుతూ ఉంటే.. త్రిలోత్తమ పరమశివుని ప్రార్థించింది. అప్పుడు మహాశివుడు బ్రహ్మదేవుని మోహవిముక్తి చేశాడు. ప్రాయశ్చిత్తంగా బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన శివలింగమే అదిఅన్నాదులై... అమ్మవారు అపితకుచలాంబదేవి ఈ ఆలయంలో సహస్ర లింగం, శ్రీముఖ లింగం ఇనుప గొలుసుల మాదిరిగా ఉన్న రాతి గొలుసులు ఎంతో ఆకర్షించాయి. రాజగోపుర నిర్మాణంతో సమయంలో ఎన్నో పర్యాయాలు కూలిపోతూ ఉంటే సిద్ధులు... ఇద్దరు యక్షులను ప్రతిష్టించి... గోపుర నిర్మాణం గావించారు. ఆ ఇద్దరు యక్షులు గోపుర భారాన్ని మోయటం మనం రాజగోపురం లోపల వీక్షించవచ్చు. ఇక్కడ మహాశివుని ముఖంగా స్థానంగా భావిస్తాము.

గిరి ప్రదక్షిణ ఫలాలు :

అరుణాచలం గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ చేతనే ముక్తినొసగే పుణ్యక్షేత్రం. ఇట్టి క్షేత్రంలో గిరిప్రదక్షిణ చేసిన విశేష ఫలితాలను ఇస్తుంది. ఇంద్రలింగం సందర్శన వల్ల ఆరోగ్యం, ఆనందం లభిస్తుంది. అగ్నిలింగం సందర్శనవల్ల రోగాలు, కష్టాలు దూరం అవుతాయి. యమలింగం కారణంగా ఎముకల బాధ నుంచి విముక్తి కలుగుతుంది. నైఋతిలింగం కారణంగా ఆరోగ్యం, కీర్తి లభిస్తాయి. వరుణలింగ సందర్శనవల్ల దీర్ఘరోగాలు మాయమవుతాయి. వాయులింగం కారణంగా మానసిక ప్రశాంతత, కుబేరలింగం వలన ఆర్థికాభివృద్ధి, ఈశాన్యలింగం వలన మనశ్శాంతి లభిస్తాయని పెద్దలు చెపుతారు. మోక్షమార్గం ప్రవేశం కారణంగా తల్లి గర్భం నుంచి వచ్చిన అనుభూతి కలుగుతుంది.

అరుణాచలేశ్వరాలయం :

ఇరవై ఎకరాల విస్తీర్ణంలో, తొమ్మిది గోపురాలతో, నాలుగు ప్రాకారాలతో నిర్మితమైనది అరుణాచలేశ్వరుని ఆలయం. తొలుత ఆలయనిర్మాణం కావించినది. చోళరాజులు. అభివృద్ధి చేసినది హోయసాల రాజులు శ్రీకృష్ణ దేవరాయలు ఆలయ ప్రవేశమునకు మూడు గోపురాలు దాటాలి. తూర్పున ఉన్న రాజగోపురం నిర్మించినది శ్రీకృష్ణ దేవరాయలు. ఈ గోపురం లోపల ఎడవమైపు సాక్షి వినాయకుడు, పరమభక్తుడైన అరుణిగిరి వాధర్ విగ్రహం ఉంటాయి. రాజగోపురం దాటగానే ఎడమవైపు స్తంభో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, కుడివైపు కృష్ణదేవరాయలచే నిర్మింపబడ్డ వేయికాళ్ళ మండపం,

రమణమహర్షి తపస్సుచేసిన పాతాళలింగం ఉన్నాయి. ఎదురుగా భళ్ళాల మహారాజు ఏర్పాటుచేసిన పెద్ద నంది కనిపిస్తుంది. ప్రతి త్రయోదశి రోజున ప్రదోషవేళ ఈ నందికి అభిషేకం జరుగుతుంది. శివభక్తులు ఆ సుందర దృశ్యాన్ని చూసి తరించాలని తపిస్తూ ఉంటారు. ఇంకా శివగంగ తీర్థం, శివగంగై వినాయకుడు, గోపుర సుబ్రహ్మణేశ్వరుని ఆలయం ఉంటాయి. ఉత్తరంవైపున అమ్మణి అమ్మన్ గోపురం ఉంటుంది. దీవినుంచి బయటకు రావాలి. ఇంకా పడమర, | దక్షిణ గోపురాలు కూడా ఉంటాయి. ఆలయ రెండో ప్రాకారం వద్ద భళ్ళాల మహారాజు నిర్మించిన భళ్ళాల గోపురం ఉంటుంది. ఈ గోపురం దాటగానే బ్రహ్మతీర్థం, కాలభైరవస్వామి ఆలయం బదనిక వృక్షం ఉంటాయి. వీటిని దాటగానే కిలిగోపురం ఉంటుంది. కిలి అంటే చిలుక అని అర్థం. అరుణాచలేశ్వర్ని పరమభక్తుడైన అరుణగిరి నాధర్ చిలుకరూపంలో ఈ గోపురంపై ఉంటారని భక్తుల విశ్వాసం. నాలుగో ప్రాకారంలోకి ప్రవేశించిన తరువాత కుడివైపు నటరాజస్వామి, ఉన్నామలై అమ్మన్, విజయ రాఘవ గణపతి, సింధూర గణపతి అపితకుచాంబ అమ్మవారు, అష్టలక్ష్మి మండపం, చిత్రగుప్తుని మండపం ఉన్నాయి. వీటన్నిటినీ గర్భగుడిలోని అరుణాచలేశ్వరుని దర్శనానంతరం చూడాలి.

అరుణాచలేశ్వరుడు :

గర్భగుడిలో అరుణాచలేశ్వరుడు విశేషమైన అలంకారంతో కన్నులవిందు చేస్తూ మనలోని భక్తి భావనను ద్విగుణీకృతం చేస్తూ ఉంటాడు. బయట ఎంత చల్లటి వాతావరనం ఉన్నా గర్భగుడిలోకి ప్రవేశించగానే లోపల వేడిగా ఉండి, చెమట పట్టే స్థితి ఉంటుంది. అందుకే అరుణాచలేశ్వరుని అగ్ని లింగంగా భావిస్తారు, పూజిస్తారు. జ్యోతిర్లింగ స్వరూపుడైన ఆ మహాశివుని కన్నులారా చూస్తూ భక్తులు తన్మయత్వంలో "పరమేశ్వరా! నీ దయతో నన్ను ఒకసారి రప్పించుకున్నావ్ మరొక పర్యాయం నన్ను అనుగ్రహించి, నీ చెంతకు రప్పించుకో తండ్రి! నీ దివ్యదర్శన భాగ్యం ఇంకో పర్యాయం పొందే అవకాశం నాకు ప్రసాదించు" అని చేతులు జోడించి ప్రార్థిస్తారు. అంతేకాక స్వామీ! నీకు తెలుసు కదా! నాకు ఏమి ఇస్తే సంతోషం కల్గుతుందో దానిని ప్రసాదించమని వేడుకుంటారు. కార్తీకమాసంలో అరుణగిరిపై జరిగే కార్తీక దీపోత్సవమునకు భక్తులు విశేష సంఖ్యలో వస్తారు. అప్పుడు స్వామివారి దివ్యనామము అరుణాచల పట్టణమంతా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

భక్తిని, ముక్తిని ప్రసాదించేది... అరుణాచల క్షేత్రం. అందుకే శివభక్తులు తిరువణ్ణామలైని కైలాసపర్వతంగా పరిగణిస్తారు. ఇక్కడ అణువణువున పరమశివుని రూపం సాక్షాత్కరిస్తూనే ఉంటుంది. ఈ క్షేత్ర విశేషాలు ఎన్ని చెప్పినా ఇంకా ఒకటి మిగిలే ఉంటుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్ర సందర్శన శివానుగ్రహం వలన మాత్రమే కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్ - ఆస్ట్రో స్పిరిట్యువల్ గురు - త్రికాలజ్ఞాన విభూషణ

పండిత డా. గానుగుల యుగంధరాచార్య గురూజీ ......🖋

విజయవాడ

చరవాణి :  76984 66666 

Comments

Popular posts from this blog