హిందూ ఆధ్యాత్మిక వేది
మానవ జీవిత లక్ష్యం ఏమిటి ?
ఆత్మ జ్ఞానం విలువైనదే గాని అంత సులువైనది కాదు.
ఇట్టి జ్ఞానాన్ని పొందటానికి ఒక్క మానవ జన్మ మాత్రమే అర్హమైనది.
జంతువులు గాని, చెట్లు గాని, దేవతలు గాని ఆత్మ జ్ఞానాన్ని పొందే హక్కు లేదు.
కర్మ చేయటానికి అధికారం మానవులకు మాత్రమే ఉన్నది.
అలాగని మానవులందరూ తమ జన్మలను ఆత్మాను భూతికి ఉపయోగించు కుంటారా ? అంటే లేదు.
ఎందుకంటే :
1. ఆత్మాను భూతిని పొందాలని, అదే మానవ జీవిత పరమ లక్ష్యమని ముందు తెలియాలి.
2. ఆత్మాను భూతి ని పొందాలనే పట్టుదల కలగాలి.
3. పొందే విధానం తెలుసుకోవాలి.
4. పొందటానికి ఆటంకంగా ఉన్న దోషాలను తొలగించు కోవాలి.
5. మార్గం చూపే సద్గురువు లభించాలి.
6. ఆయన చూపిన మార్గంలో పట్టుదలగా ప్రయాణించాలి.
అందుకే లోకంలో ఈ జ్ఞానాన్ని పొందేవారు అరుదుగా ఉంటారని భగవానుడు తెలియ జేస్తున్నాడు.
పిల్లి తన కూనలను కళ్ళు తెరిచే లోపల తట్టలలో, బుట్టలలో, గాదెలలో, గంపలలో మారుస్తుందట.
అలా ఏడు చోట్ల మారుస్తుందంటారు.
అలాగే 'మాయ' అనే పెద్ద పిల్లి ఈ జీవులను కళ్ళు తెరిచే లోపల ఎన్ని చోట్ల మార్చింది ?
83 లక్షల 99వేల 999 గాదెలలో, గంపలలో, వివిధ గర్భ కోశాలలో చేర్చింది. మార్చింది.
అలా మార్చిన తర్వాత వచ్చిన అపురూపమైన జన్మే ఈ మానవ జన్మ !
కళ్ళు తెరుచు కోవలసిన జన్మ.
పశువు లాగా, పక్షి లాగా, పురుగు లాగా ఇప్పుడూ కూడా కళ్ళు మూసుకుంటే 'పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం' తప్పదు.
చావు పుట్టుకలతో కూడిన ఈ సంసార చక్ర బంధంలో ఇరుక్కొని బయట పడ లేక బాధలు పడాలి.
ఆహారం సంపాదించు కోవటం, భోగాలను అనుభవించటం, పిల్లల్ని కనటం, పెంచటం, నిద్ర పోవటం, పశువులకు పక్షులకు జీవితలక్ష్యాలు.
కాని మానవుడి అసలు లక్ష్యం అది కాదు.
మోక్షంను అందుకోవటమే మానవ జీవిత పరమ లక్ష్యం.
ఆస్ట్రో గురు - త్రికాలజ్ఞాన విభూషణ
పండిత డా. గానుగుల యుగంధరాచార్య గురూజీ ......🖋
విజయవాడ

Comments
Post a Comment